విటమిన్ డి లోపమా.. అయితే ఇలా చేయండి

03-12-2022 Sat 11:34 | Health
  • సూర్యుడు ఉదయించే టైంలో ఎండలో నిల్చోవాలంటున్న నిపుణులు
  • రోజూ పదిహేను నిమిషాలు సరిపోతుందని వెల్లడి
  • ఆవు పాలు, నారింజ రసం, గుడ్డులోని పచ్చ సొన తీసుకున్నా మేలేనని వివరణ
When and how long should we sunbathe to compensate for vitamin D deficiency
శరీరంలో ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడానికి కీలకమైన విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే సింపుల్ గా రోజూ కాసేపు ఎండలో కూర్చోమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎంతసేపు, ఏ సమయంలో ఎండలో కూర్చోవాలి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముఖ్యమేనని అంటున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించే టైమ్ లో పదిహేను నిమిషాలు కూర్చుంటే సరిపోతుందట. అయితే, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం సూర్యరశ్మి శరీరంపై పడకుండా చూసుకోవాలని అంటున్నారు. అలాగే కళ్లపైన నేరుగా సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. 

సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి మన శరీరంలో అనేక ప్రొటీన్లు, ఎంజైమ్ ల ఏర్పాటులో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని చెప్పారు. విటమిన్ డి లోపంతో శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినడం, జుట్టు రాలడం, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడంతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

విటమిన్ డి లోపంతో బాధపడుతున్నవారు సాల్మన్ చేపలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా గుడ్డు లోని పచ్చసొన లోనూ, పుట్ట గొడుగులు(మష్రూమ్స్), ఆవు పాలు, సోయా పాలు, నారింజ రసంతో పాటు ఓట్ మీల్ లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.