Air pollution: ఊపిరితీస్తున్న ‘వాయు కాలుష్యం’!

Air pollution major cause of lung cancer in India say health experts
  • గాలిలోకి హానికారక వాయువులు
  • కొత్త కేసుల్లో 6.9 శాతం లంగ్ కేన్సర్ కు సంబంధించినవే
  • ముందుగా గుర్తిస్తే చికిత్సతో బయటపడొచ్చంటున్న నిపుణులు
మన దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం మనిషి ప్రాణాలకు సవాల్ విసురుతోంది. లంగ్ కేన్సర్ కు ప్రధాన కారకాల్లో వాయు కాలుష్యం ఉంటున్నట్టు ‘అసోసియేటెడ్ చాంబర్స్ కాఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ సదస్సులో నిపుణులు పేర్కొన్నారు. ‘లంగ్ కేన్సర్ - అవగాహన, నివారణ, సవాళ్లు, చికిత్స’ అన్న అంశంపై ఈ సదస్సు జరిగింది.

భూమిపై 100 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో 63 భారత్ నుంచే ఉన్నట్టు ఈ సదస్సు పేర్కొంది. ‘‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో ఎక్కువగా నమోదయ్యే కేన్సర్ కేసుల్లో లంగ్ కేన్సర్ కూడా ఒకటి. కొత్తగా వచ్చే కేన్సర్ కేసుల్లో 6.9 శాతం లంగ్ కేన్సర్ కు సంబంధించినవే. నమోదయ్యే కేన్సర్ మరణాల్లో 9.3 శాతం దీనివల్లే’’ అని సదస్సులో పాల్గొన్న నిపుణులు గణాంకాలను ప్రస్తావించారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ మరణాల్లో ఎక్కువ శాతం లంగ్ కేన్సర్ కు సంబంధించినవే. భారత్ లో పొగతాగే వారిలోనూ, తాగని వారిలోనూ ఈ కేసులు బయటపడుతున్నాయి. పర్యావరణ కాలుష్యాలైన ఆర్సెనిక్, క్రోమియం, నికెల్, ఆస్బెస్టాస్, డయాక్సిన్లతోపాటు పొగతాగడం ప్రధాన కారకాలు. వీటిని పరిష్కరించాల్సి ఉంది’’ అని గవర్నమెంట్ అరిగ్ నార్ అన్నా మెమోరియల్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వి.శ్రీనివాసన్ తెలిపారు.

వాయు కాలుష్యం నియంత్రణ, పర్యావరణం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. లంగ్ కేన్సర్ నివారించతగినది, చికిత్స చేయతగినదిగా పేర్కొన్నారు. లంగ్ కేన్సర్ కు వాయు కాలుష్యం సైతం ప్రధాన కారణమని ఎయిమ్స్, పాట్నా అసోసియేట్ ప్రొఫెసర్ అభిషేక్ శంకర్ పేర్కొన్నారు. ముందుగా స్క్రీన్ చేయించుకుని గుర్తించగలిగితే, లంగ్ కేన్సర్ లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Air pollution
major cause
lung cancer
health experts
warning

More Telugu News