Nadav Lapid: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ దర్శకుడు

  • ఇటీవల గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవం
  • ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై నడావ్ లాపిడ్ విమర్శలు
  • జోక్యం చేసుకున్న ఇజ్రాయెల్ రాయబారి గిలాన్
  • తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న లాపిడ్
Israel film maker Nadav Lapid said apologies for her remarks on The Kashmir Files

ఇటీవల గోవాలో జరిగిన ఇఫీ చలనచిత్రోత్సవంలో జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించిన ఇజ్రాయెలీ దర్శకుడు నడావ్ లాపిడ్ 'ది కశ్మీర్ ఫైల్స్'చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదొక దరిద్రగొట్టు సినిమా అని, ఓ అంశంపై దుష్ప్రచారం చేయడానికే ఈ సినిమా తీసినట్టు అనిపించిందని విమర్శించారు. దాంతో నడావ్ లాపిడ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 

తమ దేశానికే చెందిన ఆ దర్శకుడిపై ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల పట్ల సిగ్గుపడాలి అని విమర్శించారు. ఈ నేపథ్యంలో, నడావ్ లాపిడ్ స్పందించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. 

బాధిత కశ్మీరీ పండిట్లను అవమానించాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఆ సినిమాలో కొన్ని సీన్లు వాస్తవంగా జరిగిన ఘటనలు అని నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పడమే తన ఉద్దేశమని లాపిడ్ వివరించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని విచారం వ్యక్తం చేశారు. 

అంతేకాదు, "ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం" అంటూ జ్యూరీ సభ్యుడు సుదీప్తో సేన్ తనపై నిందను మోపడాన్ని లాపిడ్ ఖండించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం చూశాక జ్యూరీ ఏమని భావించిందో, అదే తాను వెల్లడించానని స్పష్టం చేశారు. అంతేతప్ప ఇందులో తన వ్యక్తిగత అభిప్రాయమేమీ లేదని అన్నారు. 

సినిమాను తప్పుడు ఉద్దేశాలతోనే తీశారని మళ్లీ మళ్లీ చెబుతానని లాపిడ్ పేర్కొన్నారు. నాటి విషాదంలో బాధితులుగా మిగిలిన వారి పట్ల తనకు అపార గౌరవం ఉందని తెలిపారు.

More Telugu News