Kerala: బీచ్ ఒడ్డున వెడ్డింగ్ ఫొటో షూట్.. వధువు, వరుడు ఇద్దరూ మహిళలే!

  •  తల్లిదండ్రులు విడదీసిన ఇద్దరు లెస్బియన్స్ కలిసి ఉండేందుకు అంగీకరించిన కేరళ హైకోర్టు
  • కోర్టు తీర్పు నేపథ్యంలో సముద్ర తీరంలో ఫొటో షూట్ లో పాల్గొన్న జంట
  • ప్రస్తుతం స్వలింగ  వివాహాలకు చట్టబద్ధత కల్పించని భారత ప్రభుత్వం
Kerala Lesbian Couple Once Separated by Families Turns Brides in Wedding Photoshoot

కేరళకు చెందిన ఓ జంట బీచ్ ఒడ్డున వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొంది. మెడలో దండలు వేసుకొని, చేతికి ఉంగరాలు తొడుక్కొని ఇద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో విశేషం ఏముంది? ఈ మధ్య ప్రి వెడ్డింగ్ షూట్స్ కామనే కదా అనుకుంటున్నారా? విశేషం ఉంది. ఈ ఇద్దరూ అమ్మాయి, అబ్బాయి కాదు. ఈ ఇద్దరూ మహిళలే. లెస్బియన్ (స్వలింగ సంపర్కులు) జంట అయిన అదిలా నసరీన్, ఫాతిమా నూరా సముద్ర తీరంలో ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు.

 వీళ్లు ఇలా వెడ్డింగ్ ఫొటో షూట్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ ఇద్దరి ప్రేమను వీరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇద్దరినీ బంధించి ఒకరినొకరు కలుసుకోకుండా అడ్డుకున్నారు. దీంతో వీళ్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్‌జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్‌లో వేడుక ఏర్పాటు చేసింది. 

లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. కాగా, మున్ముందు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని ఈ ఇద్దరు కోరుకుంటున్నారు. కాగా స్వలింగ వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్ధత లేదు.

More Telugu News