'లైగర్'కి పనిచేయకపోవడానికి చెప్పుకోలేని కారణాలున్నాయి: మణిశర్మ 

30-11-2022 Wed 11:32 | Entertainment
  • టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ
  • మెలోడీ బ్రహ్మగా మంచి పేరు 
  • 'చూడాలని వుంది' సినిమాతో ఎంట్రీ 
  • పూరి కాంబినేషన్లో చేసిన సాంగ్స్ సూపర్ హిట్స్
Manisharma Interview
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మణిశర్మ ఒకరు. ఆయన స్వరపరిచిన అనేక పాటలు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. ఇక మెలోడీలు చేయడంలోను ఆయనకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందువల్లనే ఆయనను 'మెలోడీ బ్రహ్మ' అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నా అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యం. మా ఫాదర్ వయోలిన్ ప్లేయర్ .. ఆయన వలన నాకు సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. చిరంజీవి -  రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో అనుకున్న సినిమా కోసం నేను ముందుగా సైన్ చేశాను .. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. అందువలన 'చూడాలని ఉంది' నా ఫస్టు సినిమా అయింది" అని అన్నారు. 

"ఇక పూరి జగన్నాథ్ సినిమాలకి వరుసగా పనిచేశాను. 'ఏక్ నిరంజన్' .. 'పోకిరి' .. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలకి అందించిన పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. ఇక 'లైగర్'కి ఎందుకు చేయలేదంటే .. అది మా ఇద్దరి మధ్య సమస్య కాదు. చెప్పుకోలేని కొన్ని కారణాల వలన, నేను ఆ సినిమా చేయలేకపోయాను" అంటూ నవ్వేశారు.