నేను ఏ హీరోతోను మాట్లాడేదానిని కాదు: జయమాలిని

29-11-2022 Tue 16:10 | Entertainment
  • శృంగార తారగా వెలిగిన జయమాలిని
  • తన అసలు పేరు అలమేలు మంగ అని వెల్లడి 
  • డబ్బు విషయాలు తల్లే చూసుకునేదంటూ వివరణ 
  • తనకి సిగ్గు ఎక్కువనీ .. గర్వం లేదని స్పష్టీకరణ    
Jayamalini Interview
తెలుగు తెరపై శృంగారతారగా జయమాలిని ఒక వెలుగు వెలిగారు. గ్లామర్ విషయంలో ఆమె హీరోయిన్స్ తో పోటీపడేవారు. అప్పట్లో జయమాలిని లేని సినిమా ఉండేది కాదు. అంత బిజీగా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. అలాంటి జయమాలిని తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
 
"నా అసలు పేరు అలమేలుమంగ .. సినిమాల్లోకి వచ్చాక జయమాలినిగా మార్చారు. మొదటి నుంచి కూడా నాకు సిగ్గు చాలా ఎక్కువ. అందువలన ఎవరితోను మాట్లాడేదానిని కాదు. షాట్ రెడీ అనేంత వరకూ నేను శాలువ కప్పుకుని ఒక పక్కన కూర్చునే దానిని. ఏం చెప్పినా సింగిల్ టేక్ లో చేసేదానిని. అందువలన హీరోలంతా నన్ను మెచ్చుకునేవారు. నేను మాట్లాడకపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించేది" అన్నారు. 

"మొదటి నుంచి కూడా డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మ చూసుకునేది. నేను సినిమాల్లో నుంచి బయటికి వచ్చేసరికి, నాకు ఎలాంటి లోటు రాకుండా చేసింది. ఇక మా అక్కయ్య జ్యోతి లక్ష్మి కొన్నాళ్లపాటు నన్ను అపార్థం చేసుకుని దూరంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత అర్థం చేసుకుంది. చివరి రోజుల్లో కూడా ఆమె ధైర్యంగానే ఉండేది. నేను ఎవరికీ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వను. అందువలన నాకు గర్వం అనుకుని ఉంటారు. నిజానికి గర్వం కాదు .. సిగ్గు వల్లనే నేను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేదానిని కాదు" అంటూ చెప్పుకొచ్చారు.