రాజమౌళిపై అమెరికా మీడియాలో కథనం

26-11-2022 Sat 22:10 | Both States
  • బాహుబలితో అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి
  • ఆర్ఆర్ఆర్ తో మరింత పేరుప్రఖ్యాతులు
  • ఇటీవల గవర్నర్ అవార్డులకోసం అమెరికా వెళ్లిన జక్కన్న
  • రాజమౌళి ముంగిట భారీ అవకాశాలు అంటూ పత్రికా కథనం 
American media story on Rajamouli
బాహుబలి రెండు భాగాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు ఎంపిక కావడం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. గోవాలో జరుగుతున్న ఇఫీ చలనచిత్రోత్సవంలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్నారు. 

కాగా, ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమం కోసం రాజమౌళి ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై కథనం రావడం విశేషం. 

ప్రఖ్యాత లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక 'ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు' అంటూ రాజమౌళిపై కథనం ప్రచురించింది. ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం చూస్తూ ఊగిపోతోందని తన కథనంలో పేర్కొంది. రాజమౌళిపై లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో కథనం రావడం పట్ల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.