రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

26-11-2022 Sat 11:58 | Andhra
  • భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
  • మనది ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం అన్న చంద్రబాబు
  • రాజ్యాంగం మంచిదైనా పాలకుడు చెడ్డవాడు అయితే చెడు ఫలితాలనే ఇస్తుందని విమర్శ
Chandrababu open letter to people of AP on Constitution Day
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం అందించే ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం మనదని ఆయన కొనియాడారు. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ రూపకర్తల ఆశయాల అమలుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగలేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పారు.

‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’’ అని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన జరుగుతోందని విమర్శించారు.