అనారోగ్యంపై కన్నడ హీరో ఉపేంద్ర వివరణ

25-11-2022 Fri 15:04
  • షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైన ఉపేంద్ర
  • దుమ్ము ఎక్కువగా ఉండటంతో ఇబ్బందికి గురయ్యానన్న ఉపేంద్ర
  • దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లొచ్చానని వ్యాఖ్య
My health is fine says Upendra
ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను 'యూఐ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు. షూట్ చేస్తున్న లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కొంచెం ఇబ్బందికి గురయ్యానని, దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని చెప్పారు. 

ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారంటూ నిన్న సాయంత్రం నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడ్డారని, చిత్ర బృందం ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు.