Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

CBI submits first charge sheet in Delhi Liquor Scam
  • తీవ్ర కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం
  • ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ
  • 10 వేల పేజీలతో చార్జిషీటు
  • ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 30కి వాయిదా
  • మరో రెండ్రోజుల్లో ఈడీ చార్జిషీటు!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఈ చార్జిషీటులో ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసింది. 

అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ లపై ఈ చార్జిషీట్ రూపొందించింది. 

చార్జిషీట్ లో ఏ1గా కుల్దీప్ సింగ్, ఏ2గా నరేందర్ సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ బోయినపల్లిలను పేర్కొంది. ఈ మేరకు మొత్తం 10 వేల పేజీలతో చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ చార్జిషీట్ ను ఆమోదించాలో, వద్దో కోర్టు అదేరోజున నిర్ణయించనుంది. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని, ఆధారాలను కూడా సీబీఐ తన చార్జిషీటుకు అనుబంధంగా కోర్టుకు సమర్పించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్)కు పంపిన వస్తువుల నివేదిక రావాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని మాత్రమే అరెస్ట్ చేశామని, మిగతా ఐదుగురిని అరెస్ట్ చేయలేదని వెల్లడించింది. 

అటు, ఇదే వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో రెండ్రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
Delhi Liquor Scam
Charge Sheet
CBI
Rouse Avenue Court
New Delhi

More Telugu News