నా కోసం వచ్చేవారెవరూ లేరు: బిగ్ బాస్ హౌస్ లో కీర్తి కన్నీళ్లు

24-11-2022 Thu 11:22
  • ప్రమాదంలో పేరెంట్స్ ను కోల్పోయిన కీర్తి 
  • అయిన వాళ్ల వేధింపులు భరించలేక దూరం 
  • ఒంటరిగా చేస్తున్న జీవనపోరాటం 
  • బిగ్ బాస్ లో కనిపించిన మదర్ - డాటర్ ఎమోషన్ 
  • బాధతో బరువెక్కిన కీర్తి హృదయం
Bigg Boss 6 Update
బిగ్ బాస్ హౌస్ లో ఒకానొక సందర్భంలో ఎవరిని గురించిన జీవితాన్ని వారు చెప్పుకోవలసి వస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫైమా కథ ఒక రకమైతే .. శ్రీ సత్య కథ మరోరకం. ఇక కీర్తి కన్నీటి కథ ఇంకోరకం. ఇలా ఎవరికి వారు జీవితంలో తమకి ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ వరకూ వచ్చినవారే.

కీర్తి విషయానికే వస్తే కొంతకాలం క్రితం జరిగిన కారు ప్రమాదంలో ఆమె తన ఫ్యామిలీని మొత్తం పోగొట్టుకుంది. ఆ ప్రమాదం కారణంగా కొంతకాలం పాటు 'కోమా'లో ఉన్న ఆమె ఆ తరువాత బయటికి వచ్చింది. బంధువుల టార్చర్ భరించలేక అక్కడి నుంచి వచ్చేసిన ఆమె, ఒంటరిగా తన జీవన పోరాటాన్ని కొనసాగిస్తోంది. తనకంటూ ఎవరూ లేరనే విషయాన్ని ఆమె తరచూ ప్రస్తావిస్తూనే ఉంటుంది. 

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ సత్యను చూడటానికి ఆమె తల్లి .. రోహిత్ ను చూడటానికి అతని తల్లి .. ఫైమాను చూడటానికి ఆమె తల్లి హౌస్ కి వచ్చారు. అప్పుడు తల్లీ బిడ్డల మధ్య ఉండే ఆ ఆనందాన్ని చూసి కీర్తి కన్నీళ్లు పెట్టుకుంది. తనకి ఎవరూ లేరు .. తన కోసం ఎవరూ రారు అనే ఆలోచనతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం టీవీల ముందు కూర్చున్నవారిని కదిలించివేస్తుంది.