డబ్బులు లేవు .. అమ్మకి ఎలా?: బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన శ్రీసత్య

24-11-2022 Thu 10:00
  • బిగ్ హౌస్ లో నడుస్తున్న ఫ్యామిలీ వీక్ 
  • శ్రీసత్యను చూడటానికి వచ్చిన పేరెంట్స్ 
  • వీల్ చైర్ లో వచ్చిన తల్లిని చూసి శ్రీసత్య ఎమోషన్  
  • ఆమె అనారోగ్యం విషయంలో కూతురిగా ఆందోళన
  • టీవీల ముందున్నవారిని కదిలించే అంశం  
Bigg Boss 6 Update
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. హౌస్ లోని సభ్యులకు సంబంధించిన పేరెంట్స్ .. సన్నిహితులు ఒక్కొక్కరిగా వచ్చి, తమకి సంబంధించిన వారితో ఆనందమైన క్షణాలను పంచుకుంటున్నారు. నిన్న రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రీసత్య కోసం ఆమె పేరెంట్స్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. శ్రీసత్య తల్లి కొంతకాలంగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయింది. ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వీల్ చైర్ లో తీసుకొచ్చారు. 

దాదాపు మూడు నెలలుగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న శ్రీసత్య ఒక్కసారిగా కన్నీళ్ల పర్యంతమైంది. తన తల్లిని హగ్ చేసుకుని ఎమోషన్స్ కి గురైంది. ఇంటిదగ్గర ఉన్నప్పుడు తన తల్లికి సంబంధించిన సేవలు తానే చేస్తూ వచ్చినట్టు చెప్పిన శ్రీసత్య, ఆమెకి గబగబా అన్నం కలిపి తినిపించడం టీవీల ముందు కూర్చున్న వారిని ఎమోషన్ కి గురిచేసింది. శ్రీసత్య తండ్రి మాటలు కూడా టీవీల ముందుకు కూర్చున్నవారికి కనెక్ట్ అయ్యాయి. 

హౌస్ లో నుంచి పేరెంట్స్ వెళ్లిపోయిన తరువాత శ్రీసత్య ఏడుస్తూ కూర్చుంది. తన పేరెంట్స్ కి ఎవరి హెల్ప్ లేదనీ, డబ్బులు లేకపోవడం వలన తల్లికి ఫిజియో థెరపీ ఆగిపోయినట్టుగా చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తినడానికి మాత్రమే తమ దగ్గర డబ్బులు ఉన్నట్టుగా తండ్రి తనతో అన్నట్టుగా చెబుతూ కన్నీళ్లపర్యంతమైంది. ఈ ఎపిసోడ్ చూసినవారు ఆమె ఫ్యామిలీకి సాయం అందితే బాగుండునని అనుకోకుండా ఉండలేరు.