ఆసుపత్రిలో చేరిన కమలహాసన్.. అభిమానుల ఆందోళన

24-11-2022 Thu 09:17
  • నిన్ననే హైదరాబాద్ వచ్చి విశ్వనాథ్‌ను కలిసిన కమల్
  • రాత్రికి చెన్నై చేరుకోగానే ఆసుపత్రిలో చేరిక
  • జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు
  • రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచన
Kamal Haasan admitted to Chennai hospital due to ill health
దిగ్గజ నటుడు కమలహాసన్ ఆసుపత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపెడుతోంది. నిన్న హైదరాబాద్‌ వచ్చిన కమల్.. తన గురువు, కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం నిన్న రాత్రే ఆయన చెన్నై చేరుకున్నారు. అంతలోనే ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

జ్వరంతో అస్వస్థతగా ఉండడంతో కమల్ శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ (ఎస్ఆర్ఎంసీ)లో చేరినట్టు తెలుస్తోంది. అయితే, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. 

ఇటీవల విడుదలైన కమలహాసన్ సినిమా విక్రమ్ సంచలన విజయం సాధించింది. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్-6తో పాటు, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 (భారతీయుడు-2) షూటింగుతో బిజీగా ఉన్నారు. ఇండియన్-2 షూటింగ్ పూర్తయిన వెంటనే మరో ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘కేహెచ్ 234’‌ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. దర్శకుడు పీఏ రంజిత్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు.