ఇది బైక్ కాదు.. ఫ్యామిలీ బస్!

23-11-2022 Wed 12:51
  • ఒకే బైక్ పై దంపతులు, ఐదుగురు పిల్లలు
  • వారి వెంట లగేజీ, రెండు పెంపుడు శునకాలు
  • ఒక్కరూ హెల్మెట్ ధరించకుండా సవారీ
Man drives bike with six passengers and two dogs video shocks netizens
ఒక బైక్ అంటే సాధారణంగా ఇద్దరు వరకు ప్రయాణించేందుకు అనుకూలం. మూడో వారు కూర్చుంటే ఇరుకుగా ఉంటుంది. బండి నడిపే వారికి సౌకర్యంగా ఉండదు. కానీ, ఓ వ్యక్తి తన బైక్ పై భార్య, ఐదుగురు పిల్లలను, రెండు పెంపుడు కుక్కలు, లగేజీని తగిలించుకుని దర్జాగా పోతుండడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వీరిలో ఒక్కరంటే ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. పైగా వాహనం కూడా 40 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. 

ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పోలీసులకు పట్టుబడితే, చలాన్లు కట్టేందుకు ఈ వ్యక్తి రుణం తీసుకోక తప్పదంటూ ఓ నెటిజన్ హాస్యంగా కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే.. ‘చలాన్లు ఏమీ ఉండవు. వీరిని ఆపిన వారు, అసలు ఇంత మంది ఎలా సర్దుకున్నారంటూ గమనించాల్సి వస్తుంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోను ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా చూశారు.