Telangana: తెలంగాణలో తొలిసారి వన్యప్రాణుల కోసం ఓవర్ పాస్ పర్యావరణ వంతెన నిర్మాణం.. ఎక్కడంటే!

  • కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎన్ హెచ్ఏఐ
  • 63వ జాతీయ రహదారిపై మంచిర్యాల– చంద్రాపూర్ మార్గంలో ఏర్పాటు
  • రూ. 30 కోట్ల ఖర్చుతో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం
Telanganas first overpass eco bridge for wild animals coming up on NH 63

అడవుల మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో వన్యప్రాణుల కోసం ఓవర్ పాస్ వంతెనలు విదేశాల్లో కనిపిస్తుంటాయి. వన్యప్రాణులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఇలాంటి నిర్మాణలు చేపడుతారు. ఓవర్ పాస్ లు సాధారణ బ్రిడ్జీల మాదిరిగా కాకుండా.. అటవీ మార్గం మాదిరిగా గడ్డితో కనిపిస్తుంటాయి. వంతెనకు దారితీసే ఇరువైపులా చాలా పచ్చదనం ఉంటుంది. 

ఇలాంటి పర్యావరణ వంతెన ఇప్పుడు తెలంగాణకు తొలిసారిగా రాబోతోంది. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని మంచిర్యాల-చంద్రాపూర్ మార్గంలో 63వ జాతీయ రహదారిపై వాంకిడి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే సంప్రదాయ అండర్‌పాస్‌ల మాదిరిగా కాకుండా, వాంకిడి సమీపంలో వచ్చే పర్యావరణ వంతెన ఓవర్‌పాస్ నిర్మాణం. వన్య జంతువులు నిర్మాణం మీదుగా వెళతాయి. దాని కింద రహదారిపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతుంటాయి. 

ఈ ప్రాంతంలో ఎక్కువగా పులులు సంచరిస్తుంటాయి. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని మంచిర్యాల-చంద్రాపూర్‌ మార్గం పర్యావరణ సున్నిత ప్రాంతం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వలస వచ్చే సమయంలో పులులు సాధారణంగా ఆ మార్గం గుండా వెళతాయి. రహదారిని దాటేటప్పుడు అవి వాహనాలకు అడ్డురాకుండా ఈ పర్యావరణ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) సుమారు ఒక కి.మీ పొడవుతో ఓవర్‌పాస్ వంతెనను నిర్మిస్తోంది. 

రూ.30 కోట్లతో నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పనుల వేగాన్ని బట్టి, దాదాపు ఆరు నెలల్లో నిర్మాణం సిద్ధం అవుతుందని చెప్పారు. ఎన్ హెచ్ఏఐ సివిల్ పనులను చేపడుతుండగా, అటవీ శాఖ నిర్మాణ రూపకల్పన, స్థాన గుర్తింపు, పర్యావరణ అంశాలు, పనుల అమలులో సమన్వయం చేస్తోంది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ వంతెన నిర్మిస్తున్నారు. పనుల అమలులో అన్ని పర్యావరణ అనుకూల చర్యలను అనుసరిస్తున్నట్లు అధికారి తెలిపారు.

More Telugu News