imd: బలహీన పడిన వాయుగుండం.. ఏపీకి తప్పిన గండం

  • నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల కుండపోత
  • తీరప్రాంతాల్లో వణికిస్తున్న ఈదురు గాలులు
  • గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు
  • చెన్నైలో పలు ప్రాంతాల జలమయం
Depression to move into these states in next 48 hours says imd

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో అల్పపీడనం మరింత బలహీన పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని ఐఎండీ పేర్కొంది. 

సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో తీర ప్రాంతల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులతో తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది.

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక చెన్నై నగరాన్ని సైతం భారీ వర్షం బెంబేలెత్తిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో గురువారం వరకు ఏపీలోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News