Saudi Arabia: ఫిఫా వరల్డ్ కప్ లో అతిపెద్ద సంచలనం... అర్జెంటీనాను ఓడించిన సౌదీ అరేబియా

  • గ్రూప్-సిలో నేడు అర్జెంటీనా, సౌదీ అరేబియా ఢీ
  • 2-1తో గెలిచిన సౌదీ
  • అర్జెంటీనా తరఫున మెస్సీ ఏకైక గోల్
  • చిచ్చరపిడుగుల్లా ఆడిన సౌదీ ఆటగాళ్లు
  • అర్జెంటీనా ర్యాంకు 3... సౌదీ ర్యాంకు 51
Biggest sensation in FIFA World Cup as Saudi Arabia beat Argentina

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అర్జెంటీనాను ఆసియా పసికూన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాదు, వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అర్జెంటీనా జైత్రయాత్రకు ఈ మ్యాచ్ తో సౌదీ అడ్డుకట్ట వేసింది.  

తనకన్నా ఎన్నో రెట్లు బలమైన అర్జెంటీనాను సౌదీ అరేబియా 2-1 తేడాతో చిత్తుచేసింది. ప్రత్యర్థి జట్టులో లయొనెల్ మెస్సీ వంటి దిగ్గజ స్ట్రయికర్ ఉన్నప్పటికీ సౌదీ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా తమ శక్తికి మించిన ప్రదర్శన చేశారు. 

నేటి గ్రూప్-సి మ్యాచ్ లో తొలి గోల్ అర్జెంటీనానే చేసింది. మ్యాచ్ 10వ నిమిషంలో మెస్సీ చేసిన గోల్ తో అర్జెంటీనా జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, 48వ నిమిషంలో సలేహ్ అల్ షెహ్రీ చేసిన గోల్ లో సౌదీ 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకే సలేమ్ అల్ దవ్సారీ చేసిన గోల్ తో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి దూసుకుపోయింది. 

అయితే స్కోరును సమం చేసేందుకు అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్జెంటీనా ఫార్వర్డ్ ల దాడులను సౌదీ అరేబియా గోల్ కీపర్, డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. దాంతో మెస్సీ సేనకు భంగపాటు తప్పలేదు.

More Telugu News