India: ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించిన భారత్‌

  • ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కొరియా క్షిపణి ప్రయోగాలపై సమావేశం
  • భద్రతామండలి, అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఉండాలన్న భారత్
  • కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు భారత్ మద్దతు పలుకుతుందని స్పష్టీకరణ
India condemns North Korea missile tests

వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాల్లో కలవరాన్ని సృష్టిస్తోంది. మరోవైపు ఇటీవల ఉత్తరకొరియా చేపట్టిన ఖండాంత క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ... ఉత్తరకొరియా చేపట్టిన ఖండాంతర క్షిపణి ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతిభద్రతలకు ప్రభావితం చేస్తాయని ఆమె చెప్పారు. ఉత్తరకొరియా అణు, క్షిపణి విస్తరణ ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ విషయంలో భద్రతామండలి, అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఉండాలని కోరారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు భారత్ నిరంతరం మద్దతు పలుకుతుందని చెప్పారు. 

మరోవైపు, ఇటీవల చేపట్టిన క్షిపణి ప్రయోగాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తన కుమార్తెతో కలిసి పరిశీలించారు. కిమ్ కూతురు బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తమ శత్రువులకు కిమ్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువుల బెదిరింపులు కొనసాగితే... అణ్వాయుధాలతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఇంకోవైపు, ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని చేపట్టిన తర్వాత భద్రతామండలి ఈ విషయంపై సమావేశం కావడం ఇది రెండోసారి.

More Telugu News