Pakistan: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆస్తులపై ఆరోపణలు.. వందల కోట్లు వెనకేసిన ఆర్మీ చీఫ్

Pakistan army chief and his family amassed billions during his 6 years
  • 2013లో పాక్ ఆర్మీ చీఫ్‌గా బజ్వా బాధ్యతలు
  • 2015లో సున్నాగా ఉన్న బజ్వా భార్య ఆస్తుల విలువ
  • 2016లో ఏకంగా రూ. 220 కోట్లకు చేరిక
  • దేశవిదేశాల్లో బజ్వా కుటుంబ సభ్యులకు వందల కోట్ల ఆస్తులు
  • సంచలనాత్మక కథనాన్ని ప్రచురించిన ‘ఫ్యాక్ట్ ఫోకస్’
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆ ఊబి నుంచి బయటపడలేక నానా అవస్థలు పడుతోంది. దేశంలో పరిస్థితి అలా ఉంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా మాత్రం గత ఆరేళ్లలో కోట్లకు పడగలెత్తారు. బజ్వా ఆస్తి అమాంతం పెరిగిందంటూ ‘ఫ్యాక్ట్ ఫోకస్’కు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకంపనలు రేపుతోంది. 

ఆ కథనం ప్రకారం.. బజ్వా కుటుంబ సభ్యులు, సమీప బంధువులు దేశవిదేశాల్లో  కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలను ప్రారంభించారు. ఇస్లామాబాద్, కరాచీలలో వాణిజ్య సముదాయాలు, ప్లాట్లు ఉన్నాయి. లాహోర్‌లో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీని వారు కొనుగోలు చేశారు.

ఇక ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బజ్వా కుటుంబం గత ఆరేళ్లలో కొనుగోలు చేసిన ఆస్తులు, వ్యాపారాల విలువ 12.7 బిలియన్ రూపాయల (పాకిస్థాన్ కరెన్సీ)కు పైమాటే. 2013లో బజ్వా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2015లో ఆయన భార్య అయేషా అంజాద్ ఆస్తుల విలువను సున్నాగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాతి ఏడాది మాత్రం ఆమె ఆస్తులు ఏకంగా రూ.220 కోట్లకు చేరుకున్నాయి.

నవంబరు 2018లో బజ్వా కుమారుడితో మహనూర్ సాబిర్‌కు వివాహం జరిగింది. అంతకుముందు ఆమె పేరిట ఎలాంటి ఆస్తులు లేకున్నా, వివాహానికి వారం రోజుల ముందు ఆమె ఆస్తులు రూ. 127 కోట్లకు చేరుకున్నాయి. కాగా, బజ్వా మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథనం వెలుగులోకి వచ్చి సంచలనమైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది.
Pakistan
Pak Army Chief
Qamar Javed Bajwa
Fact Focus

More Telugu News