TFPC: డబ్బింగ్ సినిమాల విడుదలపై స్పష్టత నిచ్చిన టీఎఫ్ సీసీ కార్యదర్శి ప్రసన్న కుమార్

TFPC Secretary Prasanna Kumar clarifies over dubbing cinemas
  • సమీపిస్తున్న సంక్రాంతి సీజన్
  • తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకేనన్న టీఎఫ్ పీసీ
  • డబ్బింగ్ చిత్రాలపై నిషేధం అంటూ ప్రచారం
  • ఖండించిన టీఎఫ్ పీసీ
ఇటీవల అనూహ్యరీతిలో టాలీవుడ్, కోలీవుడ్ మధ్య వివాదం చెలరేగడం తెలిసిందే. వచ్చే సంక్రాంతి సీజన్ లో కేవలం తెలుగు సినిమాలనే విడుదల చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్ పీసీ) తీర్మానించినట్టు ప్రచారం జరిగింది. 

అంతేకాదు, సంక్రాంతి సీజన్ లో డబ్బింగ్ సినిమాలకు అవకాశమే లేదన్న కోణంలో ఈ విషయం వివాదాస్పదమైంది. తమిళ సినీ పరిశ్రమ నుంచి అసంతృప్తి గళాలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో తమ చిత్రాలు విడుదల చేయనివ్వకపోతే, తెలుగు చిత్రాలను తాము అడ్డుకుంటామని కోలీవుడ్ నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, టీఎఫ్ పీసీ కార్యదర్శి ప్రసన్నకుమార్ స్పందించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీర్మానించిన అంశాలను వివరించారు. వచ్చే సంక్రాంతి సీజన్ లో తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వాలని, ఆ తర్వాతే డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు కేటాయించాలన్నది తమ ప్రకటన సారాంశమని వెల్లడించారు. అంతేతప్ప, డబ్బింగ్ సినిమాలను నిషేధించాలని, వాటికి థియేటర్లే ఇవ్వరాదని తాము ఎక్కడా అనలేదని ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. 

తమ సినిమాలను నిషేధిస్తే, తెలుగు సినిమాలను అడ్డుకుంటామని అనడం సరికాదని హితవు పలికారు. అందరూ బాగుండాలనేది తమ సిద్ధాంతం అని పేర్కొన్నారు.
TFPC
Telugu Cinemas
Sankranti Season
Dubbing Movies
Tollywood
Kollywood

More Telugu News