Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఐదు టీవీ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi high court issues notices to five TV channels in related to liquor scam case
  • లిక్కర్ స్కాం అంశాలు మీడియాలో ప్రసారం
  • లీక్ అవుతుండడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • పలు జాతీయ చానళ్ల తీరుపై ఆగ్రహం
ఇటీవల వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కాం పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. అయితే, ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశాలు మీడియాలో లీక్ అవుతుండడం పట్ల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో, లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. 

వాదనల సందర్భంగా, లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పత్రికా ప్రకటన చేయలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సీబీఐ మాత్రం మూడు ప్రకటనలు చేసిందని ఈడీ వెల్లడించింది. 

దీనిపై స్పందించిన ధర్మాసనం... సీబీఐ ప్రకటనలకు, మీడియా కథనాలకు సంబంధం లేదని పేర్కొంది. ఈ క్రమంలో, ఐదు టీవీ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఏఎన్ఐ, జీన్యూస్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ అడగని వాటిని కూడా అడిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. 

ఈ ఐదు చానళ్ల వార్తా నివేదికలను పరిశీలించాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఎస్ఏ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయా టీవీ చానళ్ల ప్రసారాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించి తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటనల ఆధారంగానే వార్తలు ప్రసారం చేయాలని, ప్రసార మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని చానళ్లకు దిశానిర్దేశం చేసింది.
Delhi Liquor Scam
Delhi High Court
Notice
TV Channels
Media
ED
CBI
Delhi
India

More Telugu News