జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారూ?: నాదెండ్ల మనోహర్
- నరసాపురంలో సీఎం జగన్ సభ
- జనసేనను రౌడీసేన అని పిలిచిన వైనం
- తీవ్రంగా స్పందించిన నాదెండ్ల మనోహర్
- ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు
మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తుచేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? జనసేన ఎందుకు రౌడీసేన? అని నాదెండ్ల నిలదీశారు.
"మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారూ!" అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు.
నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను, వీర మహిళలను, జనసైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను వెల్లడి చేస్తున్నాయి అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.