Vulture: నేపాల్‌లో మాయమై.. బీహార్‌లో ప్రత్యక్షమైన అరుదైన వైట్ రంప్డ్ రాబందు

Missing rare white rumped vulture from Nepal found in Bihar
  • ఆహారం లేక బక్కచిక్కిన స్థితిలో కనిపించిన రాబందు
  • అంతరించిపోయే ముప్పున్న జాతుల జాబితాలో వైట్ రంప్డ్ రాబందు
  • రాబందుకు ఆహారం అందించి సపర్యలు చేసిన అధికారులు
నేపాల్‌లో మాయమైన అరుదైన వైట్ రంప్డ్ రాబందు ఒకటి బీహార్‌లో ప్రత్యక్షమైంది. బలహీనంగా ఉన్న ఈ రాబందును రక్షించిన భారత అధికారులు దానికి చికిత్స అందించారు. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరిన వైట్ రంప్డ్ రాబందుల సంఖ్యను పెంచేందుకు బీహార్‌లో కనిపించిన ఈ రాబందు సేవలను నేపాల్ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. పశువులకు ఇచ్చే డైక్లోఫెనాక్ ఔషధం కారణంగా ఈ జాతి రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఔషధం ఇచ్చిన పశువులను రాబందులు తినడం వల్ల ఇవి మృత్యువాత పడుతున్నట్టు పేర్కొన్నారు. 

భారత ఉప ఖండంలో ఒకప్పుడు విరివిగా కనిపించే ఈ రాబందులు మానవ ఆవాసాలకు దగ్గరగా కనిపించేవి. అయితే, ఆ తర్వాత క్రమంగా వీటి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో 2000 సంవత్సరంలో వీటిని అంతరించిపోయే ముప్పు ఉన్న జాతుల జాబితాలో చేర్చారు. ఈ వైట్ రంప్డ్ రాబందుల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ రాబందుకు రేడియో ట్యాగ్ కట్టి దాని ద్వారా ఆ పక్షి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. 

అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దానికి అమర్చిన రేడియో ట్యాగ్ నుంచి సమాచారం అందకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. సెప్టెంబరు 3న అది చివరిసారిగా నేపాల్‌లోని తనాహు జిల్లాలో కనిపించింది. ఇప్పుడు దీనిని బీహార్‌లోని బర్డ్ రింగింగ్ స్టేషన్ వద్ద అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఆహారం లేక బక్కచిక్కిపోవడంతో తక్షణం ఆహారం అందించి సపర్యలు చేశారు. ప్రస్తుతం ఈ రాబందును పర్యవేక్షణలో ఉంచామని, తేరుకున్నాక వదిలిపెడతామని పేర్కొన్నారు.
Vulture
White Rumped Vulture
Nepal
Bihar

More Telugu News