హాలీవుడ్ లో గవర్నర్స్ అవార్డుల వేడుక... హాజరైన రాజమౌళి

20-11-2022 Sun 17:41
  • ఆస్కార్ ఉత్సవానికి ముందుగా గవర్నర్స్ అవార్డుల కార్యక్రమం
  • హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకం గవర్నర్స్ అవార్డ్స్
  • తనయుడు కార్తికేయతో కలిసి విచ్చేసిన రాజమౌళి
Rajamouli attends Governor Awards
ప్రపంచంలోని ప్రతి చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆస్కార్ గురించి కలలు కంటుంటారు. తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన ఆస్కార్ ను అందుకోవాలని పరితపిస్తుంటారు. ఆస్కార్ లాగే అమెరికాలో గవర్నర్ అవార్డ్స్ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు గవర్నర్స్ అవార్డుల వేడుక నిర్వహించడం ఆనవాయతీ. 

తాజాగా, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో గవర్నర్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించగా, టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ గవర్నర్స్ అవార్డుల వేడుకలో సందడి చేశారు. 

అటు, మహేశ్ బాబుతో చిత్రాన్ని కూడా వేగంగా పట్టాలెక్కించేందుకు జక్కన్న శ్రమిస్తున్నారు. మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం అడ్వెంచర్ జానర్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 

హాలీవుడ్ లో వచ్చిన ఇండియానా జోన్స్ తనకెంతో ఇష్టమైన చిత్రం అని, అడ్వెంచర్ జానర్లో సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాకు కూడా తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన కథా రచనలో బిజీగా ఉన్నారని తెలిపారు.