'ఆహా'లో మారుతి వెబ్ సిరీస్ గా 'ఇంటింటి రామాయణం'

19-11-2022 Sat 10:46
  • 'ఆహా' నుంచి మరో వెబ్ సిరీస్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే 'ఇంటింటి రామాయణం'
  • ప్రధానమైన పాత్రలో రాహుల్ రామకృష్ణ
  • త్వరలోనే రానున్న స్ట్రీమింగ్ డేట్
Intinti Ramayanam WebSeries
ఈ మధ్య కాలంలో స్టార్ డైరక్టర్స్ లో చాలామంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం కూడా వెబ్ సిరీస్ లు .. సినిమాలు .. స్పెషల్ షోలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ తో ఉన్న అనుబంధం కారణంగా మారుతి కూడా 'ఆహా'కి మంచి కంటెంట్ ఇస్తూ వెళుతున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్య ఏ మాత్రం గ్యాప్ వచ్చినా, ఆ గ్యాపులో ఆయన ఓటీటీకి కంటెంట్ ఇచ్చే పనిలో బిజీగా ఉంటున్నాడు.

తాజాగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి మారుతి మరో కంటెంట్ తీసుకుని వస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ పేరే 'ఇంటింటి రామాయణం'. ఈ కథ తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో నడుస్తుంది. ఇందులో ప్రధానమైన పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు. అతని కుటుంబం ఎలాంటి సమస్యల్లో పడుతుంది? .. వాటి బారి నుంచి బయటపడటానికి ఆయన ఏం చేస్తాడు? అనేదే కథ.

ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ జోడీగా 'నవ్య' కనిపించనుంది. 'నా పేరు మీనాక్షి' .. 'ఆమె కథ' వంటి టీవీ సీరియల్స్ ద్వారా ఆమె పాప్యులర్. ఇక కీలకమైన పాత్రలో 'గంగవ్వ' కనిపించనుంది. తెలంగాణ యాస విషయంలో ఆమె ప్రత్యేకతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కల్యాణి మాలిక్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతాన్ని అందించాడు. సితార నాగవంశీ సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.