Nancy Pelosi: నాన్సీ పెలోసీ సంచలన నిర్ణయం.. రెండు దశాబ్దాల తర్వాత స్పీకర్ పదవికి గుడ్‌బై!

  • చాంబర్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన నాన్సీ పెలోసీ
  • డెమొక్రాట్లకు కొత్త తరం నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పిన స్పీకర్
  • హౌస్‌లో 14 నిమిషాల ప్రసంగానికి అపూర్వ స్పందన
Nancy Pelosi to step down as House Democratic leader after two decades

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సంచలన ప్రకటన చేశారు. సభకు మళ్లీ ఎన్నికవాలని లేదని మనసులో మాటను బయటపెట్టారు. చాంబర్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన 82 ఏళ్ల నాన్సీ.. రెండు దశాబ్దాల తర్వాత తప్పుకుంటుండడం గమనార్హం. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాన్సీ.. పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, ప్రస్తుత ఎన్నిక పదవీకాలాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. హౌస్‌లో 14 నిమిషాల ప్రసంగంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. సభ్యులపై తనకు ఎంతో నమ్మకం ఉందని, కాబట్టి తర్వాతి కాంగ్రెస్‌లో డెమొక్రటిక్ నాయకత్వాన్ని తిరిగి కోరుకోవడం లేదని అన్నారు. ఆమె ప్రసంగానికి సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చప్పట్లతో సభ మార్మోగింది. 

తనకు, డెమొక్రటిక్ కాంగ్రెస్‌కు కొత్త తరం నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని నాన్సీ అన్నారు. దీనిని తాను చాలా గౌరవిస్తానని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన బాధ్యతను తన భుజాలపై ఉంచేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నందుకు తాను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. మధ్యంతర ఎన్నికల తర్వాత డెమొక్రాట్లు సభలో మెజారిటీని కోల్పోతారని వార్తా సంస్థలు అంచనా వేసిన తర్వాత పెలోసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

More Telugu News