Ravi Shastri: కోచింగ్ స్టాఫ్ కు విశ్రాంతి ఎందుకు... ఐపీఎల్ జరిగిన రెండు నెలలు వాళ్లకు విశ్రాంతే కదా?: రవిశాస్త్రి

  • రేపటి నుంచి న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటన
  • స్పందించిన రవిశాస్త్రి
  • కోచ్ ఎప్పుడూ జట్టు వెంటే ఉండాలని సూచన
  • ఇంగ్లండ్ నమూనాను టీమిండియా ఫాలో కావాలని హితవు
Ravi Shastri opines on Team India coaching staff got rest for New Zealand tour

టీమిండియా రేపటి నుంచి న్యూజిలాండ్ జట్టుతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ పర్యటనకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తదితరులకు విశ్రాంతినిచ్చి, తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

"సహాయక సిబ్బందికి విశ్రాంతి ఇవ్వడం వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు వస్తాయో నాకర్థంకావడంలేదు. ఐపీఎల్ జరిగిన రెండు నెలల పాటు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కు విశ్రాంతే కదా. ఆ విరామం చాలదా...? నేను గనుక కోచ్ స్థానంలో ఉంటే అన్ని వేళలా జట్టుతో పాటే ఉండి ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తుంటాను" అని రవిశాస్త్రి వెల్లడించారు. 

అంతేకాదు, టీ20 క్రికెట్ ఫార్మాట్లో టీమిండియా ఇంకా ఎదగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ అనుసరించిన విధానాన్ని టీమిండియా కూడా అనుసరించాలని సూచించారు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా సంప్రదాయబద్ధంగా ఆడిన ఇంగ్లండ్... 2015 తర్వాత ఎలా మారిపోయిందో గమనించాలని అన్నారు. 

ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు టీ20లు, వన్డేల్లో ఒక ప్రబల శక్తిగా రూపొందిందని కితాబిచ్చారు. ఉన్న వనరుల్లో మెరికల్లాంటి ఆటగాళ్లను ఏరుకుని బలమైన జట్టును తయారుచేసుకున్నారని, టీమిండియాకు కూడా అపారమైన వనరులు ఉన్న దృష్ట్యా, ఇంగ్లండ్ నమూనాను అనుసరించడం మేలు చేస్తుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

More Telugu News