అదిరిపోయిన విష్వక్సేన్ ‘ధమ్కీ’ ఫస్ట్ లుక్

  • విష్వక్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
  • హీరోయిన్ గా నివేదా పేతురాజ్
  • ఫిబ్రవరిలో నాలుగు భాషల్లో విడుదల
Vishwak Sen Dhamki  First Look released

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో విష్వక్సేన్. కొన్ని వివాదాల్లో తలదూర్చినప్పటికీ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో తనలోని దర్శకుడిని పరిచయం చేసిన విష్వక్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధమ్కీ’. ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ ను విష్వక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. మాస్, క్లాస్ కలగలిసిన లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. 

లాంగ్ స్లీవ్ టీషర్ట్ ధరించి, చేతికి గోల్డెన్‌ కలర్‌ వాచ్‌, మెడలో చైన్ తో కనుబొమ్మలను ఎగరేస్తూ.. స్టైల్ గా, సీరియస్ గా ఉన్న విష్వక్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఉంది. ‘హెచ్చరికలు లేవు‌.. ధమ్కీ మాత్రమే’ అనే క్యాప్షన్ తో విష్వక్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అలాగే, సినిమా రిలీజ్ ను సైతం ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని తెలిపాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్  హీరోయిన్ గా నటిస్తోంది.

రావు రమేశ్, పృథ్వీరాజ్‌, హైపర్‌ ఆది ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు.

More Telugu News