rajeev gandhi: రాజీవ్ హంతకుల లాగే నన్నూ విడుదల చేయండి.. సుప్రీంకోర్టుకు ఖైదీ విజ్ఞప్తి!

  • భార్యను హత్య చేసిన నేరానికి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రద్ధానంద్
  • తొలుత ఉరిశిక్ష.. తర్వాత జీవిత ఖైదుగా మార్చిన కోర్టు
  • 29 ఏళ్లుగా జైలులోనే ఉన్న నేరస్థుడు..
  • ఒక్క రోజు కూడా బయటికి రాలేదన్న లాయర్
Like Rajiv Gandhi killers set me free too by Life convict to Supreme Court

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం శిక్షను అనుభవించడం, జైలులో సత్ప్రవర్తన వంటి కారణాలతో సుప్రీంకోర్టు వారిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేసినట్లే తననూ విడుదల చేయాలంటూ ఓ ఖైదీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన లాయర్ ద్వారా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. గడిచిన 29 ఏళ్లుగా రెమిషన్ కానీ పెరోల్ కానీ లేకుండా.. ఇన్నేళ్లలో ఒక్క రోజు కూడా బయటకు అడుగుపెట్టకుండా జైలులోనే మగ్గిపోతున్నానని స్వామి శ్రద్ధానంద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మాజీ ప్రధాని సహా పదిహేడు మంది మరణానికి, మరో 43 మంది గాయాలపాలవడానికి కారణమైన వారిని కూడా 30 ఏళ్ల తర్వాత విడుదల చేసిన కోర్టు.. ఒక్క హత్య చేసినందుకు తన క్లయింటు జీవితాంతం జైలులోనే మగ్గాలనడం సరికాదని దోషి తరఫు లాయర్ చెప్పారు. ఇది సమానత్వపు హక్కును ఉల్లంఘించడమేనని లాయర్ ఆరోపించారు. కాగా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసినట్లే తనకూ స్వేచ్ఛ ప్రసాదించాలంటూ శ్రద్ధానంద్ పెట్టుకున్న పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

ఏం జరిగింది..
మైసూరు దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకిరాను శ్రద్ధానంద్ ను వివాహం చేసుకున్నాడు. 1986లో ఈ పెళ్లి జరిగింది. అయితే, అప్పటికే షాకిరాకు పెళ్లయింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి శ్రద్ధానంద్ ను పెళ్లి చేసుకుంది. షాకిరా పేరు మీద ఉన్న వందల కోట్ల ఆస్తులపై కన్నేసిన శ్రద్ధానంద్.. 1991లో ఆమెను హత్య చేశాడు. డ్రగ్స్ మత్తులో షాకిరాను సజీవంగా దహనం చేశాడు.

ఈ కేసులో 1994లో శ్రద్ధానంద్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2000 లో కోర్టు శ్రద్ధానంద్ కు ఉరిశిక్షను విధించింది. దీనిపై అప్పీల్ కు వెళ్లగా శ్రద్ధానంద్ కు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2008లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జీవితాంతం జైలులోనే ఉండాలని, రెమిషన్, పెరోల్ లాంటి సదుపాయాలు ఏవీ కల్పించ వద్దని ఆదేశించింది.

More Telugu News