Sanjay Raut: వాడిని బహిరంగంగా ఉరి తీసి చంపేయండి: సంజయ్ రౌత్

Hang him without prosecution says Sanjay Raut
  • ఢిల్లీలో ప్రియురాలిని 35 ముక్కలు చేసిన ప్రియుడు
  • లవ్ జీహాద్ కావొచ్చు, మరేదైనా కావచ్చు.. మన అమ్మాయిలు చనిపోతున్నారని రౌత్ ఆవేదన
  • హంతకుడిని విచారించాల్సిన అవసరం కూడా  లేదని వ్యాఖ్య
ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధను అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్యపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. 

శ్రద్ధను అత్యంత కిరాతకంగా హతమార్చాడని... దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని... ఇలాంటి దుర్మార్గుడిని మరో ఆలోచన లేకుండా బహిరంగంగా ఉరితీయాలని అన్నారు. దీన్ని లవ్ జీహాద్ అనొచ్చు లేక మరొక పేరుతో పిలవొచ్చు... ఏదైనా మన అమ్మాయిలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు, అమ్మాయిలకు సంజయ్ రౌత్ కొన్ని సూచనలు చేశారు. జాగ్రత్తగా ఎలా బతకాలో అమ్మాయిలు నేర్చుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచం ఎలా ఉందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మహారాష్ట్ర బిడ్డను కిరాతకంగా హతమార్చడం బాధాకరమని అన్నారు. వారిని జంట (కపుల్) అని పిలవద్దని... వారు జంట కాదని చెప్పారు. ఆ అమ్మాయి ఇంత దారుణంగా హత్యకు గురైన తర్వాత కూడా వారిని జంట అని పిలవడం సరికాదని... ఈ ప్రపంచం ఎంత ఫేక్ అనేది ఈరోజు మరోసారి అర్థమవుతోందని అన్నారు. ఇలాంటి విషయాలలో సోషల్ మీడియా సరిగా స్పందించాలని వ్యాఖ్యానించారు. 

ఆ అమ్మాయి తండ్రి ఇంటర్వ్యూని తాను చూశానని... ఆయన బాధను మనం అర్థం చేసుకోవాలని సంజయ్ రౌత్ చెప్పారు. తన కూతురుకి నచ్చ చెప్పేందుకు ఆయన ఎంతో ప్రయత్నించారని అన్నారు. ఈ దారుణానికి ఒడికట్టిన వ్యక్తిని విచారించాల్సిన అవసరం కూడా లేదని... కళ్ల ముందు ఉన్న ఆధారాలతో ఉరి తీయాలని చెప్పారు.
Sanjay Raut
Shiv Sena
Delhi
Murder

More Telugu News