Aamir Khan: సంచలన నిర్ణయం ప్రకటించిన ఆమిర్ ఖాన్

Aamir Khan announced one and half year gap to cinemas
  • ఏడాదిన్నర పాటు కెమెరాకు దూరం
  • 35 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నానని ఆమిర్ ఖాన్ వెల్లడి
  • జీవితంలో ఏదో నష్టపోయిన భావన కలుగుతున్నట్టు వివరణ
  • ఈ గ్యాప్ లో తన తల్లి, పిల్లలతో గడుపుతానని స్పష్టీకరణ
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అప్పటివరకు కెమెరా ముందుకు రానని స్పష్టం చేశారు. 

గత 35 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానని, కానీ ఏదో కోల్పోయానన్న వేదన మనసులో ఉందని తెలిపారు. ఈ క్రమంలో సినిమాలకు విరామం ఇచ్చి మా అమ్మ, పిల్లలతో గడపాలని భావిస్తున్నానని ఆమిర్ ఖాన్ వివరించారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడంపైనే తాను ప్రస్తుతం దృష్టి సారిస్తున్నానని స్పష్టం చేశారు. 

అంతేకాదు, తన కొత్త ప్రాజెక్టు 'చాంపియన్స్' చిత్రంపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి తాను నిర్మాతను కూడా అని ఆమిర్ వెల్లడించారు. తాను ఈ చిత్రంలో నటించికపోయినా నిర్మాతగా కొనసాగుతానని, మరొక నటుడితో చిత్రాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. 

ఇన్నాళ్లపాటు సినిమాల గురించే ఆలోచించి, ఎంతో నష్టపోయాననిపిస్తోందని, ఇది సరైన పంథా కాదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా, ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రం ఇటీవల విడుదల కాగా, బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' తరహాలో తీసిన ఈ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది.
Aamir Khan
Gap
Cinema
Bollywood

More Telugu News