NGT: ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ జరిమానా

NGT Fines Andhrapradesh Govt Rs 5 Crores for destroying Mada Forest
  • ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ జనసేన నాయకుడి ఫిర్యాదు
  • ఆరు నెలల్లో రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశం
  • సీఆర్ జడ్-1 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టులు చేపట్టొద్దని ఆదేశం
  • విధ్వంసం ఏమేరకు జరిగిందనే దానిపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ విశాఖపట్టణానికి చెందిన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన డి.పాల్ ఎన్‌జీటీలో కేసు వేశారు. 

విచారించిన ట్రైబ్యునల్ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని ఆదేశించింది. ఇక్కడ మడ అడవుల ఉనికి, సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించవద్దని పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆ సొమ్ము వసూలు చేయాలని సూచించింది. 

ఆ మొత్తాన్ని మడ అడవుల పెంపకం, సంరక్షణ కోసం వెచ్చించాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు, అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ఆ ప్రాంతంలో అడవులను పునరుద్ధరించేందుకు ఎంత మొత్తం అవసరమనే దానిపై అధ్యయనం కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఎన్‌జీటీ చెన్నై బెంచ్ కోరం సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ సభ్యుడు కొర్లపాటి సత్యగోపాల్ ఆదేశాలిచ్చారు.
NGT
Andhra Pradesh
Mada Forest
Kakinada
Dammalapeta

More Telugu News