RSS: కులం, మతం ఏదైనా.. భారతీయులందరూ హిందువులే: మోహన్ భగవత్

  • 1925 నుంచి ఆరెస్సెస్ ఇదే చెబుతోందన్న మోహన్ భగవత్
  • 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్న భగవత్
  • సొంత లక్ష్యాల కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దని హితవు
  • కరోనా కష్టకాలంలో దేశం కలిసి పోరాడిందన్న ఆరెస్సెస్ చీఫ్
All people of India are Hindus says RSS chief Mohan Bhagwat

కులం, మతం, ఆహారపుటలవాట్లు ఏవైనా భారత్‌లో నివసిస్తున్న వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆరెస్సెస్ 1925 నుంచి ఇదే చెబుతోందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతమని అన్నారు. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని పూర్వీకులు మనకు చెప్పారని, ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలని అన్నారు. సొంత లక్ష్యాల కోసం ఇతరుల సంపదను దోచుకునే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిన విషయాన్ని భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని భగవత్ పేర్కొన్నారు.

More Telugu News