Supreme Court: బలవంతపు మతమార్పిళ్లు జాతీయ భద్రతకు ముప్పు: సుప్రీంకోర్టు

Supreme Court says religious conversions with force is very serious issue
  • దేశంలో మతమార్పిళ్ల తీరుపై సుప్రీం ఆందోళన
  • తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని వెల్లడి
  • న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ పై విచారణ
  • అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు
దేశంలో మతమార్పిళ్లపై ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మతమార్పిళ్లు జాతీయ భద్రతకు ప్రమాదకరం అని పేర్కొంది. మోసపూరితంగా, ప్రలోభాలకు గురిచేసి, బలవంతంగా మతమార్పిడి చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. 

అక్రమ మార్గాల్లో మతమార్పిళ్లు ఇలాగే కొనసాగితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, ఆత్మప్రబోధానుసారం నడుచుకునే స్వేచ్ఛకు ప్రజలను దూరం చేస్తుందని, తత్సంబంధమైన ప్రాథమిక హక్కుకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది. 

బలవంతపు మతమార్పిళ్లు అత్యంత తీవ్రంగా పరిగణించదగ్గ విషయం అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అరాచక ఘటనలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ఒకవేళ ఈ బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకోకపోతే పరిస్థితి అత్యంత దుర్భరంగా మారుతుందని హెచ్చరించింది. 

అక్రమ మత మార్పిళ్లపై చర్యలు తీసుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. 

ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ తరహా మతమార్పిళ్లు గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయని వివరించారు. అనేక సందర్భాల్లో బాధితులు తాము దాష్టీకానికి గురవుతున్నామని తెలుసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అవతలి వర్గాలను నిలదీస్తే, వారికి సాయం చేస్తున్నామని చెబుతుంటారని వెల్లడించారు. 

దీనిపై జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పందించింది. "అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?" అంటూ సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరంగా చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్రానికి నవంబరు 22 వరకు గడువు విధించింది.
Supreme Court
Religious Conversions
Center
India

More Telugu News