Dr BR Ambedkar Konaseema District: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై జిల్లా కలెక్టర్ కు జనసేన ఫిర్యాదు

  • స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పంతం నానాజీ
  • 35 ఎకరాల సీలింగ్ భూమిని త్రిమూర్తులు ఆక్రమించారని ఆరోపణ
  • ఆ భూములను తాకట్టు పెట్టి రూ.5 కోట్ల రుణం తీసుకున్నారని ఫిర్యాదు
  • త్రిమూర్తులు నుంచి ప్రభుత్వ భూమిని రక్షించాలని వినతి
janasena leaders complaint on ysrcp mlc thota trimurthulu over land grabbing

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు సోమవారం ఓ ఫిర్యాదు అందింది. జనసేన నేత పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు తోట త్రిమూర్తులుపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెందిన 35 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న త్రిమూర్తులు... దానిలో చేపల చెరువులను ఏర్పాటు చేశారని వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

జిల్లా పరిధిలోని కాజులూరు మండలం పల్లిపాలెం పరిధిలోని ప్రభుత్వం సీలింగ్ భూమిగా గుర్తించిన 35 ఎకరాలను తోట త్రిమూర్తులు ఆక్రమించుకున్నారని పంతం నానాజీ ఆరోపించారు. గతంలో ఈ భూమిని సీలింగ్ భూమిగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ భూమిని ఆక్రమించుకున్న త్రిమూర్తులు... దానిని తన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిష్టర్ చేయించుకున్నారన్నారు. ఈ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.5 కోట్ల రుణం కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగి దురాక్రమణల నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలని ఆయన కలెక్టర్ ను కోరారు.

More Telugu News