Balweer: హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందంటూ పైలెట్ పై ఫిర్యాదు చేసిన గ్రామస్థుడు

Villager alleges his buffalo died because of Helicopter sound
  • రాజస్థాన్ లో విడ్డూరం
  • గేదె మృతికి హెలికాప్టర్ కారణం అంటున్న వృద్ధుడు
  • తన గేదె విలువ రూ.1.5 లక్షలని వెల్లడి
  • పైలెట్ పై చర్యలు తీసుకోవాలని వినతి
  • గేదెకు పోస్టుమార్టం
రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందని ఓ గ్రామస్థుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అసలేం జరిగిందంటే.... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బహ్రోద్ నియోజకవర్గ శాసనసభ్యుడు బల్జీత్ యాదవ్ ఇటీవల ఓ గ్రామంలో పర్యటించారు. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ ఎమ్మెల్యేపై ఆకాశం నుంచి పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ను వినియోగించారు. 

ఎమ్మెల్యే పర్యటనకు వచ్చిన సమయంలో పూలవర్షం కురిపించిన ఆ లోహవిహంగం, కొంతసేపు అక్కడే చక్కర్లు కొట్టి కొహ్రానా అనే గ్రామం మీదుగా తక్కువ ఎత్తు నుంచి వెళ్లిపోయింది. 

అయితే, బల్వీర్ అనే వృద్ధుడికి చెందిన గేదె ఒకటి ఆ సమయంలో మృతి చెందింది. హెలికాప్టర్ భారీ శబ్దం చేసుకుంటూ వెళ్లడం వల్లే తన గేదె చనిపోయిందని ఆ వృద్ధుడు చెబుతున్నాడు. తన గేదె విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, పైలెట్ ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఆ గేదెను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. గేదె ఎందుకు చనిపోయిందన్నది పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలుస్తుందని, ఒకవేళ హెలికాప్టర్ శబ్దం వల్లే చనిపోయినట్టయితే అప్పుడు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Balweer
Buffalo
Helicopter
Sound
Pilot
Rajasthan

More Telugu News