KCR: కేసీఆర్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  • నియంత పాలనకు బుద్ధి చెప్పాలనే బీజేపీలో చేరానన్న రాజగోపాల్‌రెడ్డి
  • రాజకీయాలు వేరు, కాంట్రాక్టులు వేరన్న బీజేపీ నేత
  • కాంట్రాక్టుపై కేసీఆర్ దుష్ప్రచారం చేశారని ఆగ్రహం
  • కాంట్రాక్టులో తనకు 5 శాతం కూడా మిగలదని స్పష్టీకరణ 
  • కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరిక
KCR Out Dated Politician says komatireddy rajgopal reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన మాట నమ్మడం లేదని, సమయం చూసి దెబ్బకొడతారని పేర్కొన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో కోరినా కేసీఆర్ పట్టించుకోలేదని, దీంతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నానన్న ఆవేదనతోనే తీర్పు కోసం మళ్లీ ప్రజల వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చారు. 

అదీ ఓ గెలుపేనా?
మునుగోడులో డబ్బు వెదజల్లి, మందీ మార్బలంతో గెలిచారని, అది కూడా ఓ గెలుపేనా? అని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ, నియంత, దోపిడీ పాలనకు బుద్ధి చెప్పాలనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినట్టు చెప్పారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మరి మీరు కూడా కాంట్రాక్టరే కదా..? అన్న రాధాకృష్ణ ప్రశ్నకు బదులిస్తూ.. తాను 2009కి ముందే కాంట్రాక్టర్‌నని, ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. అలా చెప్పాలంటే కేసీఆర్ ఒకప్పుడు పాస్‌పోర్టు బ్రోకర్ అని, కేటీఆర్ అమెరికాలో ఐటీ ఉద్యోగి అని, పువ్వాడ అజయ్, మల్లారెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయని అన్నారు. అందరికీ అన్నీ ఉన్నాయని, అలాగని అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదిస్తే తప్పు అని అన్నారు. 

కాంట్రాక్టుపై దుష్ప్రచారం
రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వడం వల్లే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనను దెబ్బకొట్టడానికి జరిగిన దుష్ప్రచారంగా కొట్టిపడేశారు. అయినా, కంపెనీ వేరు, రాజకీయ జీవితం వేరని తేల్చి చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడే దమ్ము బీజేపీకి ఉందని మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నిరూపితమైందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బీజేపీ నుంచి 20-25 మంది నాయకులను తీసుకెళ్లడం ద్వారా మైండ్ గేమ్ ఆడాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలవడం ఖాయమని తేలడంతోనే కేసీఆర్ అతి తెలివి ప్రదర్శించి, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు చేశారని అన్నారు. 

చంద్రబాబు దగ్గర పనిచేసే వ్యక్తి వద్ద పనిచేయలేం
రూ. 18 వేల కోట్ల టెండర్‌పై మాట్లాడుతూ.. అది తనకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వచ్చిందని అన్నారు. అదాని కంటే తక్కువే కోట్‌ చెయ్యడం వల్ల ఆ టెండర్ తమకు దక్కిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ త్వరలోనే జైలుకు వెళ్తారని, ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారని అన్నారు. తనకు దక్కిన కాంట్రాక్టులో ఐదు శాతం కూడా మిగలదని స్పష్టం చేశారు. చంద్రబాబు వద్ద పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్‌ను చేస్తే ఆయన దగ్గర అణిగిమణిగి ఉండలేమని అన్నారు. కేసీఆర్‌ను ఓడించాలంటే జరగాల్సింది యుద్ధమేనని, అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News