YTP: కేసీఆర్‌పై షర్మిల విమర్శలు.. పాదయాత్రలో ఉద్రిక్తత

Tension prevailed In YS Sharmila foot march
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదంటూ షర్మిల విమర్శలు
  • వైటీపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు
  • న్యూ కొత్తపల్లి సమీపంలో రోడ్డుపై బైఠాయించిన టీఆర్ఎస్ కార్యకర్తలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సాగుతోంది. నిన్న ఆమె కొత్తూరు చౌరస్తాలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వైటీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలపై షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడిచేసేందుకు వచ్చారని, వారిపై కేసులు నమోదు చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర కొనసాగింది. అయితే, న్యూ కొత్తపల్లి సమీపంలో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి పాదయాత్ర ముందుకు సాగకుండా అడ్డుకున్నాయి. పోలీసులు వారిని పక్కకు తప్పించడంతో పాదయాత్ర ముందుకు కదిలింది. అనంతరం పాదయాత్ర చామనపల్లికి చేరుకుంది. అక్కడ షర్మిల మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యల పరిష్కారంపై పాదయాత్ర చేస్తున్న ఆడబిడ్డపై దాడిచేయాలనుకునే వారు మహిళల కంటే తక్కువేనని అన్నారు.
YTP
YS Sharmila
Peddapalli District
KCR
Koppula Eshwar

More Telugu News