Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి తగ్గిన ఓటింగ్

Voting percentage decreased in Himachal Pradesh
  • రాష్ట్రంలోని 68 స్థానాలకు ఎన్నికలు
  • బరిలో 412 మంది అభ్యర్థులు
  • 66.58 శాతం పోలింగ్ నమోదు
  • 52 మంది కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్
  • గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ధీమా
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నిన్న జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాల్లో 412 మంది అభ్యర్థులు పోటీ పడగా వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తం 66.58 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నిన్న ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మంచు, చలి కారణంగా మధ్యాహ్నం వరకు ఓటింగ్ మందకొడిగానే సాగింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. సిర్‌మౌర్ జిల్లాలో అత్యధికంగా 72.79 శాతం పోలింగ్ నమోదైంది. 

ఇక, సముద్ర మట్టానికి 15,266 అడుగుల ఎత్తులో ఉండే లాహాల్, స్పితి జిల్లాలో అత్యల్పంగా 21.95 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 1.21 లక్షల మంది ఉండగా 38 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తున ఉండే తషిగాంగ్, కాజా ప్రాంతాల్లో ఉన్న 52 మంది ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 

మరోవైపు, అధికార పార్టీ బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేటికవే గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ రెండోసారి అధికారం చేపట్టకపోవడంతో ఈసారి తమదే గెలుపని కాంగ్రెస్ చెబుతోంది. అయితే, అభివృద్ధిని చూసి ప్రజలు తమకే పట్టం కడతారని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఇంకోవైపు, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Himachal Pradesh
BJP
Congress
AAP

More Telugu News