ashok babu: విలేజ్ సెక్రటరీలు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లు చూపితే రాజీనామా చేస్తా: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

30 percent of govt employees still didnt get salaries says Ashok Babu
  • 9వ తేదీ వచ్చినా 30 శాతం మంది ఉద్యోగులకు జీతాలు రాలేదు
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు లేవు
  • రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది
రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల 30 వేల మందికి ఏ నెల జీతం ఆ నెల చెల్లించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా రాష్ట్ర ఉద్యోగులకు 30 శాతం మందికి ఇంతవరకు జీతాలు రాలేదని చెప్పారు. పోలీసు, హెల్త్ డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్, గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్లు రాలేదని, ఎప్పుడొస్తాయో తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు లేవని అన్నారు. 

'ఆప్కాస్ పేరుతో 99 వేల మంది ఉద్యోగులు రిజిష్టర్ చేయించుకున్నారు. ఒక్క నెలలో కూడా ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల పూర్తిగా జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 80 శాతం జీతాలు ఇచ్చి 20 శాతం టెక్నికల్ సమస్యలు వచ్చాయని దాటవేస్తూ వస్తున్నారు. రెగ్యులర్ గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. 2022వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. 2021లో కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. రాష్ట్రం కేవలం అప్పులపై ఆధారపడి నడుస్తోంది. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి' అని చెప్పారు. కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లు చూపలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తుల జీతాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం సరికాదని అన్నారు.
ashok babu
Telugudesam
Andhra Pradesh
Govt Employees Salaries

More Telugu News