Jagan: తూర్పు గోదావరి జిల్లాలో బయో ఇథనాల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • గుమ్మళ్లదొడ్డి వద్ద ప్లాంట్ నిర్మాణం
  • రూ.270 కోట్ల వ్యయంతో పరిశ్రమ
  • ప్లాంట్ నిర్మిస్తున్న అసాగో ఇండస్ట్రీస్
  • 6 నెలల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నామన్న సీఎం జగన్
CM Jagan laid foundation stone for bio ethanol plant in East Godavari district

ఏపీ సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి వద్ద నిర్మిస్తున్న బయో ఇథనాల్ ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ను అసాగో ఇండస్ట్రీస్ కంపెనీ రూ.270 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. బ్రోకెన్ రైస్ (నూకలు)తో ఈ ప్లాంట్ లో బయో ఇథనాల్ తయారుచేస్తారు. 

ఈ బయో ఇథనాల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన అనంతరం సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్గదర్శకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, ఒక పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులు కేవలం 6 నెలల్లోనే ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. 

ఈ బయో ఇథనాల్ కంపెనీ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ కుమారుడు ఆశిష్ గుర్నానీకి చెందిన పరిశ్రమ అని సీఎం జగన్ వెల్లడించారు. ఆర్నెల్ల కిందట తాను దావోస్ వెళ్లిన సమయంలో, సీపీ గుర్నానీతో భేటీ అయ్యానని, ఆయన తన కుమారుడు బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న విషయం చెప్పారని వివరించారు. ఈ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పగా, వారిని వెంటనే రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు. ఆపై అన్ని రకాల అనుమతులతో కేవలం 6 నెలల్లోనే ప్లాంట్ శంకుస్థాపన కూడా చేసుకుందని అన్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, అసాగో ఇండస్ట్రీస్ ఎండీ-సీఈవో ఆశిష్ గుర్నానీ, ఏపీ మంత్రులు గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొందరు వైసీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.

More Telugu News