టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ కు సెమీస్ బెర్తు ఖాయం

  • చివరి గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఘన విజయం
  • చెలరేగిన కేన్ విలియమ్సన్, బౌలర్లు
  • గ్రూప్1 లో అగ్రస్థానంలో కివీస్
NZ complete another comfortable win and are all but through to the semi final

టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. సూపర్ 12 రౌండ్, గ్రూప్1 లో భాగంగా శుక్రవారం జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 35 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది. దాంతో, గ్రూప్ 1 లో మూడు విజయాలు సహా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో రెండు జట్లు రేసులో ఉన్నప్పటికీ కివీస్ కు సెమీస్ బెర్తు ఖాయమైనట్టే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు. 

ఓపెనర్లు ఫిన్ అలెన్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 32), డెవాన్ కాన్వే (28), డారిల్ మిచెల్ (31 నాటౌట్) సత్తా చాటారు. ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ హ్యాట్రిక్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. గారెత్ డెలానీ రెండు, మార్క్ అడైర్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 186 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ఐర్లాండ్ 150/9 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (37), ఆండీ బల్బర్నీ (30) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ మూడు, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కేన్ విలియమ్సన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News