రిటర్నులకు నో చెబుతున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్.. లాభాల కోసం కొత్త మార్గం!

  • వరుస వెంట ఎక్కువ రిటర్నులు చేస్తే అకౌంట్ బ్లాక్
  • వినియోగదారులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు
  • నష్టాలను సాకుగా చూపిస్తున్న ఈ కామర్స్ సంస్థలు
Flipkart and Amazon are making product returns tougher and accounts blocked

అమెజాన్, ఫ్లిప్ కార్ట్. ఈ రెండూ దేశంలోనే రెండు అగ్రగామి ఈ కామర్స్ సంస్థలు. అంతేకాదు, మరో బలమైన సంస్థ అన్నదే లేకుండా, ఈ రెండూ వేటికవే పోటీ పడుతూ భారత వినియోగదారుల గడపలను చేరిన అమెరికా కంపెనీలు. వీటిల్లో ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేసి, డెలివరీ అయిన తర్వాత నచ్చకపోతే ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం. చెల్లించిన డబ్బు వాపసు వస్తుంది. డెలివరీ అయిన ఉత్పత్తి నాణ్యత నాసిరకంగా ఉంటే? డ్యామేజ్ అయితే? చెప్పిందొకటి, పంపింది మరొకటి అయితే? ఇలా ఎన్నో కారణాలతో కస్టమర్లు వాటిని రిటర్న్ చేయవచ్చు. ఈ సౌకర్యం వల్లే కోట్లాది మంది భారతీయులు ఈ ప్లాట్ ఫామ్ లలో షాపింగ్ కు అలవాటు పడ్డారు.


జాగ్రత్త తప్పదు..
కానీ, ఇకపై ఈ సౌలభ్యం ఉండదని గుర్తు పెట్టుకోవాలి. సరైన కారణం లేకుండా రిటర్న్ చేస్తే.. మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సరైన కారణాలున్నా, ఎక్కువ రిటర్నులు వచ్చినా అంతే. దీనికి ఈ సంస్థలు చెబుతున్న కారణం ఒక్కటే. రిటర్నుల కారణంగా తాము భారీగా నష్టపోతున్నామని. ఈ సంస్థలు గతంలో మాదిరి భారీ డిస్కౌంట్స్ ఏమీ ఇవ్వడం లేదు. అయినా కానీ, నష్టాలను సాకుగా చూపిస్తూ భారత మార్కెట్లో పరోక్ష లాభాలు పెంచుకునేందుకు స్ట్రాటజీ 2.0 లేదా తదుపరి వ్యాపార వ్యూహానికి తెరతీశాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.

మారుతున్న ధోరణి
సాధారణంగా ఈ ప్లాట్ ఫామ్ లపై ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, టాయ్స్ రిటర్న్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలం ఎక్చేంజ్ కు (అది కూడా సరైన కారణంతోనే) అవకాశం ఉంటుంది. ఇక వస్త్రాలు, గృహోపకరణాల వంటివి రిటర్న్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు అయితే దాదాపు అన్ని ఉత్పత్తులకు రిటర్న్ సదుపాయం ఉండేది. కానీ, ఎక్కువగా రిటర్నులు వస్తున్న ఒక్కో విభాగంలోని ఉత్పత్తులకు ఇవి ఆ సదుపాయాన్ని ఎత్తేస్తూ వస్తున్నాయి. కనుక కొనుగోలు చేసే ముందే వినియోగదారుడు ఒకటికి రెండు సార్లు రిటర్న్ లేదా రీప్లేస్ మెంట్ లో ఏ ఆప్షన్ ఉన్నదీ చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే తర్వాత రిటర్న్ లేకపోగా, ఖాతా బ్లాక్ అయిపోయే పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చు.

తాజా పరిణామం..
ఇటీవలి కాలంలో ఎక్కువగా రిటర్నులు వస్తున్న ఖాతాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ చేస్తున్నాయి. కనీసం ముందస్తు నోటీసు కానీ, హెచ్చరించడం కానీ చేయడం లేదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో కస్టమర్లు ఎత్తి చూపుతున్నారు.  

ఢిల్లీకి చెందిన ఓ కస్టమర్ కు అమెజాన్ లో ప్రైమ్ సభ్యత్వం ఉంది. సాధారణంగా ప్రైమ్ సభ్యులంటే అమెజాన్ కు ముఖ్యమైన వారని అర్థం. ఇటీవలే తన ఖాతా బ్లాక్ అయిందంటూ ఆమెకు ఈ మెయిల్ వచ్చింది. అధిక సంఖ్యలో ఆర్డర్లకు సంబంధించి రిఫండ్ అభ్యర్థనలు వచ్చాయంటూ అందులో పేర్కొంది. దసరా పండుగల సీజన్ లో ఒకే వారంలో ఆమె మూడు ఆర్డర్లను రిటర్న్ చేసింది. దీంతో అమెజాన్ ఈ చర్య తీసుకుంది. ఈ స్థాయిలో రిఫండ్ (చెల్లించింది వెనక్కి ఇవ్వడం) లను జారీ చేయడం సాధ్యం కాదని అమెజాన్ తేల్చి చెప్పింది. ఖాతాను కూడా పునరుద్ధరించలేదు.

పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో గత నెలలో ఫ్లిప్ కార్ట్ లో 44 ఉత్పత్తులకు ఆర్డర్ చేశాడు. అందులో 14 ఉత్పత్తులను వెనక్కి తిప్పి పంపించేశాడు. దీంతో ఫ్లిప్ కార్ట్ కు ఇది నచ్చక అతడి ఖాతాను బ్లాక్ చేసింది. 10 రోజుల్లోపు రిటర్న్ చేసే అవకాశం ఉండగా.. ఇబ్బందేమిటన్నది అతడి ప్రశ్న. తాను రిటర్న్ చేసిన 14 ఉత్పత్తుల్లో 8 డ్యామేజ్ అవడం లేదంటే చెప్పిన దానికి భిన్నమైనవిగా పేర్కొన్నాడు. సో కస్టమర్లూ బీకేర్ ఫుల్ అని ఈ రెండు సంస్థలు హెచ్చరిస్తున్నట్టు ఉంది. నేడు ఆఫ్ లైన్ స్టోర్లు కూడా దాదాపు ఆన్ లైన్ ధరలకే విక్రయిస్తున్నాయి. కనుక వినియోగదారులు మళ్లీ పూర్వపు విధానానికే ఓటేసే పరిస్థితి వస్తుందేమో..?

More Telugu News