Ayyanna Patrudu: 1947కు ముందు జైళ్లన్నీ స్వాతంత్ర్య సమరయోధులతో నిండిపోయినట్టు.. ఇప్పుడు టీడీపీ నేతలతో నిండిపోతున్నాయి: టీడీపీ నేతలు

  • అయ్యన్న అరెస్ట్‌ను ముక్తకంఠంతో ఖండించిన టీడీపీ
  • ఇది జగన్ మార్కు ఫాసిస్టు పాలనకు నిదర్శనమన్న నేతలు
  • అయ్యన్నపై ఆరోపణలు నిజమైతే అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులెందుకని ప్రశ్న
  • సీఐడీ పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యంలా మారారని ఆరోపణ
  • మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
TDP Fires on Jagan Over Ayyanna Arrest

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌ను టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న, రాజేశ్‌లను సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.

 ఇది బీసీలపై దాడి తప్ప మరోటి కాదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడడాన్ని ఘోరంగా, ప్రజల హక్కులను పరిరక్షించే ప్రయత్నాన్ని ద్రోహంగా భావిస్తున్న ప్రభుత్వం తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించి హింసిస్తోందన్నారు. జగన్ మార్కు దురాగతాలు, ఫాసిస్టు పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. జగన్ పాలనా విధ్వంసం అంతులేనిదని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.  

రాష్ట్రంలో రాక్షస రాజ్యం
ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ మరో నేత ఆలపాటి రాజా అన్నారు. అర్ధరాత్రి వేళ గోడదూకి ఇంటికి వచ్చి అయ్యన్నను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జగన్ శాడిజానికి ఇది నిదర్శమని అన్నారు. సీఐడీ పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యంలా మారారని అన్నారు. రౌడీల్లా మద్యం తాగి ఇళ్లలోకి జొరబడడం, బూతులు తిట్టడం నీచాతినీచమని అన్నారు. రాష్ట్రంలో  పెయిడ్ టెర్రరిజం నడుస్తోందని, ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

తాను జైలు పక్షిని కావడంతో అందరినీ జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947కు ముందు జైళ్లన్నీ స్వాతంత్ర్య సమరయోధులతో నిండినట్టు ఇప్పుడు జైళ్లన్నీ టీడీపీ నేతలతో నిండిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీకి అండగా ఉన్నారనే బీసీ నేతలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐడీ పోలీసులు చట్టాన్ని వదిలేసి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చే అదేశాల్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్ అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

అయ్యన్నపాత్రుడి అరెస్టు అనైతికమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మంత్రిగా చేసిన వ్యక్తిని ఇలా దౌర్జన్యంగా, అక్రమంగా అరెస్ట్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గాలను, జగన్ అవినీతిని ఎండగడుతున్నారన్న అక్కసుతోనే పాలకులు ఆయనపై కక్ష కట్టారని మరో నేత జవహర్ అన్నారు.

పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లలో ప్రవేశించడం జగన్ పాలనలోనే చూస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తున్నందువల్లే అయ్యన్నపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. జగన్ రెడ్డి తొత్తులుగా మారిన పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

More Telugu News