NTR: పునీత్ కు మరణానంతరం 'కర్ణాటక రత్న'... కర్ణాటక అసెంబ్లీలో ఎన్టీఆర్ భావోద్వేగ ప్రసంగం

  • గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్
  • నేడు కన్నడ రాజ్యోత్సవం
  • కర్ణాటక అసెంబ్లీలో కార్యక్రమం
  • పునీత్ కుటుంబ సభ్యులకు పురస్కారం అందజేత
  • కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్.. కన్నడలో ప్రసంగం
NTR attends Kannada Rajyotsava

నేడు నవంబరు 1 సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో కన్నడ రాజ్యోత్సవం నిర్వహించారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ అవార్డును ఇవాళ విధాన సౌధలో పునీత్ కుటుంబ సభ్యులకు ప్రదానం చేసింది. 

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరయ్యారు. కాగా, విధాన సౌధకు విచ్చేసిన సందర్భంగా ఎన్టీఆర్ ను సీఎం బసవరాజ్ బొమ్మై కన్నడ పేటా, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, "జూనియర్ ఎన్టీఆర్ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు" అంటూ తెలుగులో పలికి ఎన్టీఆర్ కు మైక్ అందించారు. సీఎం నుంచి మైక్ అందుకున్న ఎన్టీఆర్ "ఎల్లారిక్కు నమస్కార" అంటూ కన్నడలో ప్రసంగించడం విశేషం. 

కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ ఆఫ్ కర్ణాటక, గొప్ప కుమారుడు, గొప్ప భర్త, గొప్ప నటుడు, గొప్ప గాయకుడు, గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు, అన్నింటికి మించి ఒక గొప్ప వ్యక్తి అంటూ పునీత్ రాజ్ కుమార్ ను కీర్తించారు. ఆయనకు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, తనను వారి కుటుంబంలో ఒకరిగా భావించే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

More Telugu News