Gujarat: మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై మరమ్మతులు చేపట్టిన కంపెనీ ఒరెవా వివరణ ఇదే

  • గుజరాత్ లో కూలిపోయిన మోర్బీ తీగల వంతెన
  • 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వైనం
  • రూ.2 కోట్లతో మరమ్మతులు చేపట్టిన ఒరెవా కంపెనీ
  • పరిమితికి మించి జనంతోనే బ్రిడ్జి కూలిపోయిందన్న ఒరెవా
  • ఒరెవా యజమాని సహా 8 మందిని అరెస్ట్ చేసిన సిట్
Oreva group says overload is the reason for morbi bridge collapse

140 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న గుజరాత్ లోని తీగలతో కూడిన మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై ఆ వంతెనకు మరమ్మతులు చేపట్టిన కంపెనీ ఒరెవా గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 కోట్ల ఖర్చుతో మోర్బీ వంతెనకు మరమ్మతులు చేపట్టినట్లుగా గోడ గడియారాల తయారీ కంపెనీ అయిన ఒరెవా తెలిపింది. 

ఈ మరమ్మతులతో బ్రిడ్జికి పదేళ్ల పాటు గ్యారెంటీ ఇచ్చినట్లు తెలిపింది. ఇక మరమ్మతుల తర్వాత బ్రిడ్జిపై 125 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపిన ఒరెవా... ఆదివారం ఒకేసారి 500 మందికి బ్రిడ్జిపైకి అనుమతి ఇచ్చారని, ఈ కారణంగానే ప్రమాదం సంభవించిందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. మోర్బీ బ్రిడ్జీ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)తో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారమే సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో వెనువెంటనే సిట్ తన విచారణను మొదలుపెట్టింది. విచారణలో భాగంగా మరమ్మతులు చేపట్టిన ఒరెవా కంపెనీ యజమానితో పాటు మరమ్మతులను పర్యవేక్షించిన సంస్థ అధికారులతో కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. ఇక బ్రిడ్జిపై కొందరు యువకులు చేసిన విన్యాసాల కారణంగానే బ్రిడ్జి కూలిపోయిందన్న విషయంపైనా సిట్ దర్యాప్తు ప్రారంభించింది.

More Telugu News