Bridge collapse: గత 20 ఏళ్లలో వివిధ దేశాలలో వంతెనలు కూలిన ఘటనలు ఇవీ..!

  • గుజరాత్ తరహాలో దారుణ ప్రమాదాలు
  • ముంబైలో వంతెన కూలి నీట మునిగిన స్కూలు బస్సు
  • బీహార్ లో రైల్వే వంతెన కూలడంతో రైలు ప్రమాదం
  • చైనాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి
Deadliest Bridge Collapses Of The Past 20 Years

గుజరాత్ లో బ్రిడ్జి కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇంకా కొంతమంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటి దారుణ ప్రమాదాలు గతంలోనూ జరిగాయి. గడిచిన 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన దారుణ ప్రమాదాల వివరాలు..

2021లో మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న సిటీ మెట్రో స్టేషన్ లో కొంతభాగం కూలిపోయింది. దీంతో ఓ ప్యాసింజర్ రైలు కూలి, 26మంది ప్రయాణికులు చనిపోయారు.

2018లో ఇటలీలోని జెనోవా నగరంలో కీలకమైన వంతెన కుప్పకూలింది. ఫ్రాన్స్ ను ఇటలీని కలిపే హైవేపైన నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో వాహనాలు కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

2016లో కోల్ కతాలో నిత్యం బిజీగా ఉండే ఫ్లైఓవర్ కూలిపోవడంతో 26 మంది మృత్యువాత పడ్డారు. కాంక్రీట్ శ్లాబుల కింద చిక్కుకున్న దాదాపు వందమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

2011లో డార్జిలింగ్ సమీపంలోని ఓ వంతెన కూలిపోయింది. నదిపై నిర్మించిన ఈ వంతెనపై జనం కిక్కిరిసిపోవడంతో అకస్మాత్తుగా కూలింది. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

2007లో చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలి 64 మంది వర్కర్లు మృత్యువాత పడ్డారు. అదే ఏడాది నేపాల్ లో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. భేరీ నదిపై కట్టిన వంతెన కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై సుమారు 400 మంది ఉన్నారని అధికారుల అంచనా. బ్రిడ్జి కూలడంతో నదిలో పడ్డ సుమారు 100 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

2006లో పాకిస్థాన్ లో భారీ వర్షాలకు మార్దాన్ లోని ఓ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది డిసెంబర్ లో బీహార్ లోని పురాతన బ్రిడ్జి ఒకటి కూలి ప్యాసెంజర్ ట్రైన్ కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 34 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు తెలిపారు.

2003 ఆగస్టులో ముంబైలో వంతెన కూలి నదిలో పడడంతో 20 మంది మరణించారు. ఇందులో 19 మంది చిన్న పిల్లలే కావడం విషాదకరం. వంతెన పై నుంచి స్కూలు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిసెంబర్ లో బొలీవియాలో వరదలకు ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి దాటుతున్న బస్సు నీట మునిగి అందులో ప్రయాణిస్తున్న 29 మంది మృత్యువాత పడ్డారు.

More Telugu News