Diabetes: మధుమేహం రాకూడదు అనుకుంటే.. ఇలా చేయాల్సిందే!

  • మధుమేహంలో మూడు రకాలు
  • టైప్-2 స్వయంగా ఆహ్వానించే రకం
  • జీవనశైలిలో మార్పులతో దీన్ని దూరం పెట్టొచ్చు
Diabetes 5 natural ways to prevent the disease even before it begins

డయాబెటిస్... ఈ పేరు చెబితే యువతలో కలవరం మొదలవుతుంది. లైఫ్ స్టయిల్ కారణంగా వచ్చే ఈ వ్యాధి నేడు దేశంలో కోట్లాది మందిని వేధిస్తోంది. ముఖ్యంగా శారీరక కదలికలు తగ్గిపోయి, అధిక కేలరీలతో కూడిన ప్రాసెస్డ్ ఆహార వినియోగం పెరిగిపోయిన నేటి రోజులు.. మధుమేహానికి దగ్గరి దారులు. 

మధుమేహం అంటే..?
మధుమేహం / డయాబెటిస్ అంటే.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇదొక దీర్ఘకాలిక ఆరోగ్య స్థితి. మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చే వ్యవస్థ గాడి తప్పడం వల్ల వచ్చేది. తిన్న ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్ గా మారుస్తుంది. దీన్ని రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. ఈ సమయంలో పాంక్రియాస్ విడుదల చేసే ఇన్సులిన్.. గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా చేరవేస్తుంది. ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏర్పడే స్థితినే మధుమేహంగా చెబుతారు.

రకాలున్నాయి..
మధుమేహంలో టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ అని మూడు రకాలున్నాయి. ఆటో ఇమ్యూన్ స్పందన వల్ల వచ్చేది టైప్ 1 మధుమేహం. ఈ కండిషన్ లో శరీరంలో ఆటో యాంటీబాడీలు ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థపై దాడి చేసి దెబ్బతీస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. వీరికి ఇన్సులిన్ ఇవ్వడమే ఏకైక చికిత్సా మార్గం. 5-10 శాతం మేర మధుమేహుల్లో టైప్-1 వారు ఉంటారు. జన్యు సంబంధ కారణాలతో ఇది వస్తుంది. ఎక్కువగా పిల్లలు, టీనేజ్, యుంగ్ ఏజ్ లో బయటపడుతుంది. 

కానీ, టైప్ 2 మధుమేహంలో గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించుకునే వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. అప్పుడు మన శరీర భాగాలు, ముఖ్య అవయవాలపై ప్రభావం పడుతుంది. మధుమేహం బాధితుల్లో 95 శాతం వరకు వీరే ఉంటారు. సాధారణంగా మధ్య వయసు, ఆ తర్వాత ఇది కనిపిస్తుంటుంది. ఒక్కసారిగా కాకుండా, శరీరంలో కొంత కాలానికి ఈ స్థితి ఏర్పడుతుంది.

ఇక జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చేది. డెలివరీ అయిన కొంత కాలానికి ఇది వెళ్లిపోతుంది. కానీ, జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల పుట్టే పిల్లలకు సమస్యలు రావచ్చు.

నివారణ మార్గాలు..
టైప్1 డయాబెటిస్ రాకుండా చూసుకోవడం ఒకరి చేతుల్లో ఉండేది కాదు. కానీ, టైప్-2 బారిన పడకుండా అయితే జాగ్రత్త పడొచ్చు. 

బరువు
అధిక బరువు, స్థూలకాయం మధుమేహానికి దగ్గరి మార్గం అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక బరువు లేకుండా చూసుకోవాలి. పరిమితి కంటే ఎక్కువ బరువు ఉంటే 35 - 40 ఏళ్లు రాకముందే అధిక బరువును తగ్గించుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గడం వల్ల మధుహేహం రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం తేల్చాయి. 

శారీరక చర్యలు
రోజువారీగా కనీసం 40 నిమిషాలు నడవడం, పరుగెత్తడం చేయవచ్చు. సైక్లింగ్, ఈత, ఏరోబిక్ వ్యాయామాలతోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, ప్రాణాయామం, యోగసనాలతోనూ చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రోజంతా కదలికలు ఉండేలా చూసుకోవాలి. కూర్చుని ఉద్యోగాలు చేసేవారు కనీసం అరగంటకు ఒకసారి లేచి అటూ, ఇటూ నడవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం
పోషకాహారానికి పెద్ద పీట వేయాలి. పండ్లు, కూరగాయలను, పీచు ఉండే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించాలి. బ్రౌన్ రైస్, జొన్నలు, కొరలు, సజ్జలు, ఓట్స్ తదితర ధాన్యాలను తీసుకోవచ్చు.

పొగతాగడం మానాలి 
పొగతాగే అలవాటు తెలియకుండా దీర్ఘకాలానికి ఎన్నో ముప్పులను తీసుకొచ్చి పెడుతుంది. పొగాకులో ఉండే నికోటిన్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను చంపేస్తుంది. అందుకుని ఆరోగ్యానికి పెద్ద శత్రువైన పొగాకును దూరం పెట్టాలి.

నీరు
నీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోజులో 3 లీటర్లు తాగేలా చూసుకోవాలి. చక్కెరలు కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలి. 

More Telugu News