Pakistan: పాకిస్థాన్ గ్రే లిస్ట్ లో ఉన్నపుడు ఉగ్రదాడులు తగ్గాయి: భారత్

While Pakistan Was In Grey List Terror Attacks Declined in Jammu
  • ఐక్యరాజ్య సమితిలో వెల్లడించిన భారత్
  • దాడులకు, పాక్ గ్రే లిస్ట్ కు సంబంధం తేల్చాలని డిమాండ్
  • కౌంటర్ టెర్రరిజం కమిటీ కల్పించుకోవాలని విజ్ఞప్తి
పాకిస్థాన్ పై ఆర్థిక ఆంక్షలు అమలులో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతోద్యోగి ఒకరు పేర్కొన్నారు. పాక్ పై ఆంక్షలు తొలగించే అవకాశాలు పెరిగిన కొద్దీ జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు కూడా పెరిగాయని చెప్పారు. 

ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి షఫీ రిజ్వీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పాకిస్థాన్ ఉన్నంతకాలం ఉగ్ర కార్యకలాపాలు తగ్గడం.. అందులోంచి పాక్ బయటపడుతుందనే సంకేతాలు కనిపించగానే దాడులు పెరగడానికి మధ్య సంబంధం వెనకున్న గుట్టును తేల్చాలని కోరారు. ఈమేరకు ఆయన భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీకి విజ్ఞప్తి చేశారు.

జమ్మూ కశ్మీర్ లో దాడులు..
జమ్మూకశ్మీర్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ, పోలీస్ క్యాంపులపై 2014లో జరిగిన ఉగ్ర దాడుల సంఖ్య ఐదు అని రిజ్వీ తెలిపారు. 2015లో ఎనిమిది, 2016లో 15 చోట్ల ఉగ్ర దాడులు జరిగాయని వివరించారు. ఆ తర్వాత 2017 నుంచి జమ్మూకశ్మీర్ లో ఉగ్ర దాడులు తగ్గుతూ వచ్చాయని అన్నారు. ఆ ఏడాది మొత్తం 8 ఉగ్ర దాడులు జరిగాయని, 2018లో 3 చోట్ల ఉగ్రవాదులు దాడి చేశారని వివరించారు. 2019లో పుల్వామా దాడి తర్వాత 2020లో ఉగ్రదాడులు చోటుచేసుకోలేదన్నారు. 2021 ఏడాది నుంచి జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు మళ్లీ పెరిగాయని రిజ్వీ వివరించారు. 

అయితే, 2018 నుంచి 2021 వరకు ఉగ్రదాడులు తగ్గడానికి కారణం ‘గ్రే లిస్ట్’(పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పెట్టడం) మాత్రమేనని సులభంగా అర్థమవుతోందన్నారు. దీంతో పాటు ఆర్టికల్ 370 రద్దు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో దూకుడు, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్ కూడా ఉగ్రదాడులు తగ్గడానికి కారణాలేనని చెప్పారు. అన్నిట్లోనూ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ దే కీలక పాత్ర అని రిజ్వీ వివరించారు. పాకిస్థాన్ గ్రే లిస్టులో ఉన్న విషయాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ రిజ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తోందనే ఆరోపణలతో పాకిస్థాన్ ను 2018లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. ఇటీవలే పాక్ ను గ్రే లిస్టులో నుంచి ఎఫ్ఏటీఎఫ్ తప్పించింది.
Pakistan
FATF
Grey list
terror attacks
Jammu And Kashmir

More Telugu News