Rishi Sunak: చర్చిల్ వ్యాఖ్యలకు 75 ఏళ్ల తర్వాత సునాక్ సమాధానం: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

  • బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన రిషి సునాక్
  • భారతీయులు తక్కువ స్థాయి కలిగి, వారి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయన్న విన్‌స్టన్ చర్చిల్
  • ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ జీవితం అందమైనదన్న ఆనంద్ మహీంద్రా
On cusp of Independence Churchill said Anand Mahindra on Rishi Sunak rise

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన ఎన్నికపై ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పలు ఆరోపణలతో బోరిస్ జాన్సన్ గద్దె దిగిన తర్వాత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన లిజ్ ట్రస్ 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవి రేసులోకి మళ్లీ బోరిస్ జాన్సన్, రిషి సునాక్ వచ్చారు. అయితే, ఆ తర్వాత బోరిస్ తప్పుకోవడంతో రిషి ఎన్నిక లాంఛనమే అయింది. భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు ఇప్పుడు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు. 

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గతంలో భారతీయులపై వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గుర్తు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. భారత్‌లోని నాయకులందరూ తక్కువ స్థాయి కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయని చర్చిల్ అన్న మాటలను గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా..75 ఏళ్ల తర్వాత భారత మూలాలున్న ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా చర్చిల్ మాటలకు జవాబు ఇచ్చారని, జీవితం అందమైనదని ట్వీట్ చేశారు.

More Telugu News